Dehradun : వరద ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌.. పది మంది గల్లంతు.

సాయం కోసం చేతులు ఊపుతూ, కేకలు వేసిన బాధితులు

Update: 2025-09-16 07:30 GMT

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ఓ నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అందులోని పదిమంది కూలీలు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిమంది కూలీలు ఓ ట్రాక్టర్ లో నది దాటుతున్నారు. నది మధ్యలోకి వచ్చాక ట్రాక్టర్ మొరాయించింది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో ట్రాక్టర్ ఆగిపోవడంతో అందులోని కూలీలు భయాందోళనకు గురయ్యారు. కాపాడాలంటూ చేతులు ఊపుతూ కేకలు వేశారు. ఇంతలోనే నీటి ప్రవాహ ఉద్ధృతికి ట్రాక్టర్ బోల్తా పడడం, కూలీలంతా నీళ్లలో పడిపోవడం వీడియోలో కనిపించింది.

దీంతో ఒడ్డున ఉన్న గ్రామస్థులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. కూలీల కుటుంబ సభ్యులు రోదిస్తూ నది ఒడ్డున పరుగులు తీశారు. తమ వారిని కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. అయితే, నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడం, క్షణాల వ్యవధిలోనే వారు గల్లంతు కావడంతో ఏమీ చేయలేకపోయారు. నదిలో గల్లంతైన పది మంది కూలీలు చనిపోయి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు.

Tags:    

Similar News