Haryana: ఏసీ పేలి ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు కుక్క మృతి
హర్యానాలో ఘోరం
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి అర్ధరాత్రి కాళరాత్రి అయింది. ఏసీ పేలి కుటుంబ సభ్యులు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఏసీ పేలి భార్యాభర్తలతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ఒక్కసారిగా ఏసీ పేలి భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి రెండవ అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ముగ్గురు సభ్యులతో పాటు పెంపుడు కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఇక కొడుకు కిటికీ నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు సచిన్ కపూర్, అతని భార్య రింకు కపూర్, కుమార్తె సుజన్ కపూర్‌గా గుర్తించారు.
అయితే ఏసీ పేలిపోయాక పొగలు వ్యాపించాయి. ఊపిరాడక పోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో గదిలో నిద్రిస్తున్న కొడుకు మాత్రం కిటికీలోంచి దూకేశాడు. ఇక భారీ పేలుడు సంభవించడంతో ఇరుగుపొరుగు వారు చేరుకుని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాల్గో అంతస్తులో ఏడుగురు సభ్యుల కుటుంబం నివసిస్తుందని, మూడవ అంతస్తును కపూర్ కార్యాలయంగా ఉపయోగించుకున్నారని స్థానికులు చెప్పారు.