Meerut Drum Murder Case: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మీరట్ 'బ్లూ డ్రమ్' హత్య కేసు నిందితురాలు ముస్కాన్‌

భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మీరట్ జైల్లో ఉన్న ముస్కాన్

Update: 2025-11-25 00:30 GMT

తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని బ్లూ డ్రమ్ములో దాచిన కేసులో మీరట్ జైల్లో ఉన్న నిందితురాలు ముస్కాన్ సోమవారం సాయంత్రం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆమె ప్రసవించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

జైలు సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరేశ్ రాజ్ శర్మ పీటీఐతో మాట్లాడుతూ.. నొప్పులు ఎక్కువ కావడంతో ముస్కాన్‌ను ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు. ప్రసూతి విభాగం హెడ్ డాక్టర్ శకున్ సింగ్ మాట్లాడుతూ, నవజాత శిశువు 2.4 కిలోల బరువుతో ఉందని, వైద్యులు సుఖ ప్రసవం చేశారని చెప్పారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు పేర్కొన్నారు.

ముస్కాన్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశామని, అయితే ఆసుపత్రికి ఎవరూ రాలేదని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో ఆసుపత్రి ప్రధాన ద్వారం, వార్డుల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సూచనలు జారీ చేశామని, వైద్య రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది మార్చి 4న మీరట్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఇంట్లో సౌరభ్ హత్యకు గురయ్యాడు. ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి సౌరభ్‌కు మత్తుమందు ఇచ్చి, కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహం తల, చేతులను వేరు చేసి సిమెంట్‌తో నింపిన బ్లూ డ్రమ్ములో దాచిపెట్టారు. ఘటన తర్వాత ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయారు. వారి ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే సౌరభ్‌ను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మార్చి 18న సాహిల్‌తో పాటు ముస్కాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News