Shakti Dubey: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు.. ఫస్ట్ ర్యాంకర్ శక్తి దూబే
విజేత వివరాలివే , ఎంతగా చదివిందంటే;
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దీంతో ఒక్కసారిగా ఆమె స్పెషల్ గా మారారు. శక్తి దూబే గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
శక్తి దూబే తండ్రి పోలీసు దళంలో పని చేస్తున్నారు. తల్లి సాధారణ గృహిణి. ఒక సాధారణ కుటుంబం నుంచి శక్తి వచ్చారు. పాఠశాల విద్య తర్వాత కళాశాల కోసం వారణాసికి మారారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చేరారు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. ఆమె ముందుండి నాయకత్వం వహించేందుకు ఆసక్తి చూపేవారు. స్టూడెంట్ డిబేటింగ్ కమిటీకి అధిపతి అయ్యారు. అలహాబాద్ యూనివర్సిటీలో బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.
శక్తి దూబే విజయంపై ఆమె తండ్రి దేవేంద్ర కుమార్ దూబే స్పందించారు. చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమె చదువులో నేను పోషించిన ఏకైక పాత్ర ఆమెకు అవసరమైన ప్రతిదీ అందుబాటులో ఉంచడం. మిగిలినది ఆమె కృషి, దేవుని ఆశీర్వాదం. ఫలితాలతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను కాబట్టి ఎక్కువగా ఇంటి బయటే ఉంటాను. ఆమె విజయంలో నా భార్య కీలక పాత్ర పోషించింది” అని దేవేంద్ర దూబే అన్నారు. శక్తి దూబే కవిత్వం రాస్తారు. ఆలోచనాత్మకమైన వన్-లైనర్లను ఇష్టపడే వ్యక్తి. ఆమె ఆలోచనలు పదునైనవి.
ఇక రెండో ర్యాంకర్ హర్షిత గోయల్ బరోడాలోని ఎంఎస్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందారు. ఆమె రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షకు అర్హత సాధించారు.
ఇక నేషనల్ లెవెల్ లో మూడో ర్యాంకర్ అర్చిత్ పరాగ్. తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ అయిన పరాగ్.. UPSC ప్రకటించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఫిలాసఫీ (తత్వశాస్త్రం) ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంది.