Odisha Assembly: ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా
తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్;
ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దౌస్(32) చరిత్ర సృష్టించారు. కేవలం 30 రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలబడిన సోఫియా.. బీజేపీ అభ్యర్థి పూర్ణ చంద్ర మహాపాత్ర(69)పై 8,001 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సోఫియా ఫిర్దౌస్ అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తండ్రి మహమ్మద్ మోక్విమ్ బారాబంకి-కటక్ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమార్తె సోఫియా ఫిర్దౌస్‌ను కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపింది. 2014, 2019 ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించటం ఆమెకు ఈసారి బాగా కలిసివచ్చింది.
ఫిర్దౌస్ ఒడిశా సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మోకిమ్ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.
ఫిర్దౌస్ కళింగ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్ జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు. 2023లో కాన్ఫెడరేషన్ ఆప్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసీయేషిన్ ఆఫ్ ఇండియా(సీఆర్‌ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్‌ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్ జోన్ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)కి కో చైర్మన్‌గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్‌డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్‌ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్‌కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు.
కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది.