Honeymoon Murder Case: హనీమూన్‌ మర్డర్ కేసులో .. 790 పేజీల ఛార్జ్‌షీట్‌

సోనమ్‌కు షాక్..

Update: 2025-09-06 03:30 GMT

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత తర్వగా మరిచిపోయే కేసే కాదు. యావత్తు దేశాన్నే కలవరపాటుకు గురి చేసిన కేసు ఇది. తాజాగా ఈ కేసులో 790 పేజీల ఛార్జిషీట్‌ను సోహ్రా సబ్‌-డివిజన్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సమర్పించారు. ఈ మేరకు మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకు భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురిపై హత్య అభియోగాలు మోపింది. మొత్తం ఛార్జిషీట్‌లో ఐదుగురు పేర్లను చేర్చారు. సోనమ్, రాజ్‌ కుష్వాహాతో పాటు ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మి, విశాల్ సింగ్ చౌహాన్‌లపై అభియోగాలు మోపారు. నిందితులందరిపై భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్ 103 (I) హత్య, 238 (a) నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం, 61 (2) నేరపూరిత కుట్ర కింద అభియోగాలు మోపారు. ఈ కేసును మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేసింది.

ఇక సాక్ష్యాలను ధ్వంసం చేయడం, దాచడం వంటి ఆరోపణలపై అరెస్టయిన జేమ్స్, తోమర్, అహిర్‌బార్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అదనపు ఫోరెన్సిక్ నివేదికలు వెలువడిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ చార్జిషీట్ సమర్పించబడుతుందని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు. ఆస్తి డీలర్ సిలోమ్ జేమ్స్, నేరం చేసిన తర్వాత సోనమ్ దాక్కున్న భవనం యజమాని లోకేంద్ర తోమర్, ఆ ప్రాంత సెక్యూరిటీ గార్డు బల్బీర్ అహిర్‌బార్‌పై కూడా దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

యూపీకి చెందిన సోనమ్ రఘువంశీ-ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి మే 11, 2025న వివాహం జరిగింది. వివాహం అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న జంట అదృశ్యమయ్యారంటూ కలకలం రేపింది. మేఘాలయ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జూన్ 2న కొండల్లో రాజా మృతదేహం లభించింది. రాజా హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఇక సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఏదో జరిగిందని దర్యాప్తు కొనసాగిస్తుండగా జూన్ 8న యూపీలో సోనమ్ ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురి సాయంతో భర్తను చంపేనట్లుగా సోనమ్ తెలిపింది. దీంతో యావత్తు దేశమంతా ఉలిక్కిపాటుకు గురైంది. అనంతరం నిందితులను జైలుకు తరలించారు.

ఈ ఘటన తర్వాత సోనమ్ సోదరుడు గోవింద్.. బాధిత కుటుంబానికి అండగా నిలిచాడు. సోనమ్‌తో అన్ని రకాల బంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. రాజా కుటుంబానికి తోడుగా ఉంటామని వెల్లడించారు. అత్తింటి వారి సొత్తు తిరిగి ఇచ్చేశాడు. 

Tags:    

Similar News