Lionel Messi: “మెస్సీ” ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తా అరెస్ట్..
బెయిల్ నిరాకరణ, 14 రోజుల పోలీస్ కస్టడీ..
లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ నిరాకరిస్తూ, 14 రోజలు పోలీస్ కస్టడీకి పంపించారు. అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ పర్యటన సందర్భంగా శనివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్రం గందరగోళం తలెత్తింది. స్టేడియంలో మెస్సీని చూసేందుకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అయితే, మెస్సీని వీఐపీలు, రాజకీయ నాయకులు చుట్టుముట్టి ఉండటం, ఆయనను చూసే అవకాశం రాకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గందరగోళం, హింస చెలరేగింది, రెచ్చిపోయిన అభిమానులు స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, టెంట్లు విసిరేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు అక్కడ నుంచి మెస్సీని తరలించారు. ఫుట్‌బాల్ స్టార్‌ను చూడటానికి టికెట్‌కు రూ. 14,000 వరకు చెల్లించిన అభిమానులు అతన్ని చూడలేకపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెస్సీ ‘G.O.A.T. టూర్ ఆఫ్ ఇండియా’ ప్రధాన నిర్వహకుడు, ప్రమోటర్ అయిన శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా స్టేడియం గందరగోళంపై దత్తాను 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. ఈ ఘటనపై బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో, ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ..స్టేడియంలో జరిగిన ఘటన, నిర్వాహన లోపాన్ని చూసి తీవ్రంగా కలత చెందానని, షాక్‌కు గురయ్యానని ఆమె శనివారం అన్నారు. ఈ దురదృష్ట సంఘటనలకు లియోనల్ మెస్సీకి, క్రీడా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.