Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్

మరో కేసులో తెరపైకి పూజా ఖేడ్కర్‌ పేరు

Update: 2025-09-15 03:15 GMT

పూజా ఖేద్కర్.. భారతీయులకు సుపరిచితమైన పేరు. పూణె మాజీ ఐఏఎస్ అధికారిణి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి.. సిబ్బందిపై ఇష్టానురీతిగా ప్రవర్తించడంతో వార్తల్లోకి ఎక్కింది. ఆమె తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి, యూపీఎస్సీకి ఫిర్యాదులు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. దీంతో ఆమె బండారం బయటపడింది. నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్‌తో పాటు విద్యకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు కూడా నకిలీవిగా తేలడంతో ఐఏఎస్ సర్వీస్ నుంచి యూపీఎస్సీ తొలగించింది. జీవితంలో ఎప్పుడూ యూపీఎస్సీ పరీక్షలు రాకుండా నిషేధం విధించింది. ఇక అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు కూడా బుక్ చేశారు. ఆమెపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే అప్పటి నుంచి ఆమె అడ్రస్ లేదు. దుబాయ్‌కు పారిపోయినట్లు వార్తలు వినిపించాయి.

తాజాగా మరోసారి పూజా ఖేద్కర్ కుటుంబం చిక్కుల్లో పడింది. ఓ ట్రక్ డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి ఇరాకటంలో పడ్డారు. పోలీసులు పూజా ఖేద్కర్ ఇంట్లోకి వెళ్లి డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించారు. ఈ సందర్భంగా పూజా ఖేద్కర్ తల్లి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

నవీ ముంబైలోని ఐరోలి సిగ్నల్ దగ్గర మిక్సర్ ట్రక్కు-కారు ఢీకొన్నాయి. MH 12 RT 5000 నంబర్ ప్లేట్ ఉన్న కారును మిక్సర్ ట్రక్కు ఢీకొట్టింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్‌ ప్రహ్లాద్ కుమార్‌ను కారులో ఉన్న వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రహ్లాద్ కుమార్‌ను బలవంతంగా కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు.

అయితే డ్రైవర్ మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. కారును పూణెలోని చతుశృంతి ప్రాంతంలోని పూజా ఖేద్కర్ ఇంట్లో గుర్తించారు. దీంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పూజా ఖేద్కర్ తల్లి మనోరమ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. గేట్లు తెరిచేందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు ప్రతిఘటించి లోపలికి వెళ్లి డ్రైవర్‌ను రక్షించారు.

పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఇప్పటికే పొలంలో తుపాకీతో పొరుగున్న ఉన్న రైతును బెదిరించి.. దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు గతేడాది అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్ని రోజుల జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలైంది. తాజాగా మరోసారి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. దీంతో మనోరమ ఖేద్కర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు.

Tags:    

Similar News