Tamil Nadu: గవర్నర్‌ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరిన తమిళనాడు ప్రభుత్వం
గవర్నర్ జాతీయ సమైక్యతను అవమానించారంటున్న సీఏం స్టాలిన్;
తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని రీకాల్ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ హాజరైన ఒక కార్యక్రమంలో ఆలపించిన తమిళ రాష్ట్ర గీతంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ‘ద్రవిడ’ అనే పదాన్ని పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరైన చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలో ఇది చోటు చేసుకుంది. ‘ద్రవిడియన్ అలర్జీతో గవర్నర్ బాధపడుతున్నారా? అందుకే ఆయన తమిళ గేయం నుంచి ద్రవిడ అన్న పదాన్ని తొలగించారా?’ అని స్టాలిన్ ప్రశ్నించారు. జాతీయ గీతంలోనూ ద్రవిడ అనే పదాన్ని దాటవేసే దమ్ము గవర్నర్‌కు ఉందా అని సవాల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తమిళుల మనోభావాలను దెబ్బతీసిన గవర్నర్‌ను కేంద్రం వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం ఆరోపణలను గవర్నర్ కార్యాలయం ఖండించింది. గవర్నర్ కేవలం ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, గీతాన్ని ఆలపించిన ట్రూప్ ద్రవిడ పదాన్ని దాటవేసిందని వివరణ ఇచ్చింది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణలు చెబుతూ గాయకుల పరధ్యానం కారణంగానే అది జరిగిందని పేర్కొంది. తమ కారణంగా గవర్నర్‌కు జరిగిన ఇబ్బంది పట్ల క్షమాపణలు కోరింది.
తమిళ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అలాగే తాను కూడా అలాగే పని చేస్తానని గవర్నర్ రవి పేర్కొన్నారు. గవర్నర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం సరికాదని.. తప్పుడు ఆరోపణలు చేయడం చౌకబారు వ్యవహారం అని పేర్కొన్నారు.
హిందీ మాట్లాడాని రాష్ట్రాలలో హిందీ భాష ఉత్సవాలు వద్దు
హిందీయేతర రాష్ట్రాలలో హిందీ భాషా కార్యక్రమాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక లేఖ రాస్తూ చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలు, హిందీ మాసం ముగింపు వేడుకలను సంయుక్తంగా నిర్వహించాలన్న కేంద్రం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆయా భాషలను కించపరచడమేనని, ఈ క్రమంలో హిందీ మాసం వేడుకల నిర్వహణను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అలా కాకుండా హిందీయేతర రాష్ర్టాల్లో ఆయా రాష్ర్టాల భాషా దినోత్సవాలను నిర్వహించి ప్రోత్స హించాలని స్టాలిన్ సూచించారు.