MK Stalin:తమిళనాడు లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ చేస్తూ స్టాలిన్ నిర్ణయం..

మృతుడు అజిత్ కుమార్ తల్లికి సారీ చెప్పిన సీఎం..;

Update: 2025-07-02 01:15 GMT

తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే, ఆలయ సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ఇది ఎవరూ సమర్థించలేని లేదా క్షమించలేని చర్య’’ అని అన్నారు. ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చింది ప్రభుత్వం. దర్యాప్తు నిష్పాక్షికత కోసం కేసు సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసుల చర్య సమర్థనీయం కాదని పేర్కొంటూ.. ఇలాంటి చర్యలు ఎక్కడా, ఎప్పుడూ జరగకూడదని హెచ్చరించారు. దర్యాప్తు కోసం తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేరం పట్ల అజిత్ కుమార్ కుటుంబానికి సీఎం స్టాలిన్ క్షమాపణ చెప్పారు. అజిత్ కుమార్ తల్లిని క్షమించాలని కోరారు. ధైర్యంగా ఉండాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎస్ఎం సుబ్రమణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి వీపు, నోటీ, చెవుల వద్ద కారం పొడి ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తిపై ఇలాంటి దాడి ఏంటని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ దాఖలులో ఆలస్యం, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడంలో వైఫల్యం, పోలీసుల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంపై రాష్ట్రానికి “ఎటువంటి అభ్యంతరం” లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.

Tags:    

Similar News