BJP MLA: వందేభారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడ్డ ఎమ్మెల్యే

రైల్వే ట్రాక్‌పై ప‌డిపోయిన బీజేపీ ఎమ్మెల్యే;

Update: 2024-09-17 05:00 GMT

దేశంలో కొత్తగా మరో ఆరు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్- నాగ్‌పూర్ రైలుతో పాటు ఆగ్రా-వారణాసి రైలు కూడా ఉంది. స్థానికంగా ఈ రైలు ప్రారంభోత్సవానికి యూపీకి చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే హాజరయ్యారు. రైలుకు ప్లాట్‌ఫామ్‌పై నిలబడి పచ్చజెండా ఊపుతుండగా ఎమ్మెల్యే ట్రాక్‌పై పడిపోయారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ అప్రమత్తమై ఆమెను పైకి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటవా రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం 6 గంటలకు చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆగ్రా-వారణాసి వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ఎటావా జిల్లా సాదర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సరిత భౌదౌరియా హాజరయ్యారు. ఆగ్రాలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ ఈ రైలును ప్రారంభించారు. అక్కడ నుంచి ఎటావా స్టేషన్‌కు రైలు చేరుకోగానే దానికి జెండా ఊపి ప్రారంభించడానికి ఆయనతో పాటు పలువురు నాయకులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. ఈ క్రమంలో జెండా ఊపుతుండగా వెనుక నుంచి కొందరు నెట్టేయడంతో ఆమె రైలుకు ముందు పట్టాలపై పడిపోయారు. దీంతో ఒక్కసారిగా అందరూ కంగారుపడిపోయారు. సమయానికి రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేను వెంటనే పోలీసులు, రైల్వే సిబ్బంది బయటకు లాగారు.

ఈ ఘటనపై ఎటావాకు చెందిన బీజేపీ నేత సంజీవ్ భౌదౌరియా మాట్లాడుతూ.. ‘‘రైలుకు పచ్చజెండా ఊపుతుండగా ట్రాక్‌పై పడిపోయిన ఎమ్మెల్యేను అక్కడున్నవారు పైకి లాగారు.. కార్యక్రమం ముగిసిన వరకూ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఆమెను తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఆమెకు ఎటువంటి గాయాలుకాలేదు.. ఒకవేళ, అంతర్గంగా ఏదైనా గాయమైందా? అనేది నిర్దారించాల్సి ఉంది’ అని అన్నారు. కాగా, ఆగ్రా-వారణాసి వందేభారత్ రైలుకు ఎటావా ముందున్న తుండ్లా స్టేషన్‌ వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు స్వాగతం పలికారు.

Tags:    

Similar News