Manipur : మణిపూర్‌లో కొనసాగుతున్న మొబైల్ ఇంటర్నెట్ నిషేధం
నవంబర్ 13 వరకు ఇంటర్నెట్ బంద్;
మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగిన కాల్పుల్లో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
బిష్ణూపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు జరుగుతున్నాయని మణిపూర్ డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తులు అదృశమయ్యారని, నలుగురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అపహరించారని తెలిపారు. దీంతో అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉందని, దాంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగించినట్లు పేర్కొన్నారు.
గత ఆరు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. అయితే, ఈ సంఘటనతో ఆ రాష్ట్రం ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇక, తాజాగా మణిపూర్ ప్రభుత్వం నాలుగు హిల్ జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ చేస్తున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. ఉఖ్రుల్, సేనాపతి, చందేల్ తో పాటు తమెంగ్‌లాంగ్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ప్రయోగాత్మకంగా ఇంటర్నెట్ ఆంక్షలను ఎత్తివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
మణిపూర్ హైకోర్టు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో మొబైల్ టవర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత ఈ చర్య వచ్చింది. మంగళవారంనాడు నాలుగు కొండ జిల్లా కేంద్రాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి ఉఖ్రుల్ జిల్లా పరిపాలన అధికారిని అడిగినప్పుడు.. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో కొన్ని ఎంపిక చేసిన మొబైల్ టవర్లు మాత్రమే యాక్టివేట్ చేయబడ్డాయి.. కానీ కనెక్టివిటీ పేలవంగా ఉంది. పునరుద్ధరణ ప్రయోగాత్మకంగా జరుగుతుందన్నారు.