jharkhand: పోటీ పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్
జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;
నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో జరగనున్న పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీఎల్‌సీసీఈ) పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 823 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగుతుండగా.. దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా నివారించాలనే లక్ష్యంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నారు.
ఇక, ఈ పరీక్షకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వెల్లడించారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమన్నారు.