PM Modi: శీతాకాలం ఆలస్యమైనా రాజకీయ వేడి పెరిగిందన్న మోడి
సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని సూచన;
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి స్పందించారు. ప్రజలు నెగెటివిటీని తిరస్కరించారని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్కు వచ్చిన ప్రధాని మీడియాతో మాట్లాడారు. శీతాకాలం ఆసల్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ఆయన అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక్షాన ఉన్న వారికి అనూహ్యమైన మద్దతు లభిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్న తపన ఉంటే, అప్పుడు ప్రజా వ్యతిరేకత ఉండదని మోదీ అన్నారు.
దేశంలో ఇప్పుడు ప్రభుత్వ అనుకూలత, సుపరిపాలన, పారదర్శకత ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ద్వేషభావాన్ని దేశం తిరస్కరించిందన్నారు. ప్రజల ఆశయాలను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్య ఆలయమే కీలకం అన్నారు.
పార్లమెంట్ సమావేశాలకు వచ్చే సభ్యులందరూ ప్రిపేరు కావాలని, బిల్లుల గురించి సభలో చర్చ జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. కొత్త పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.