Narendra Modi: ఎన్నికల ప్రచారం ముగియగానే ధ్యానం లోకి మోదీ
30న కన్యాకుమారికి చేరుకోనున్న ప్రధాని;
లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు. అందులో భాగంగా ఆయన తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుని వివేకానంద రాక్ మెమోరియల్‌లో జూన్ 1వ తేదీ వరకు ధ్యానంలో గడుపుతారు.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో అప్పటివరకు ప్రశాంతంగా గడపాలని మోదీ యోచిస్తున్నారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు కన్యాకుమారి ధ్యాన మండపంలో గడుపుతారని అధికార వర్గాలు తెలిపాయి.అయితే గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ఇలా విశ్రాంతి తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ క్షేత్రానికి వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత హిమాలయాల్లో 11700 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో నరేంద్ర మోదీ ధ్యానం చేశారు. కేదార్‌నాథ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న రుద్ర ధ్యాన గుహలో ప్రధాని.. ఒక రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు.
మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 6 దశల పోలింగ్ పూర్తయింది. ఇక జూన్ 1 వ తేదీన చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4 వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏడో విడత ఎన్నికల ప్రచారం ఈ నెల 30 వ తేదీన ముగియనుంది.