Monkeypox In India: భారత్‌లో 8కి చేరిన మంకీపాక్స్ కేసుల సంఖ్య..
Monkeypox In India: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ వైరస్ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది.;
Monkeypox In India: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ వైరస్ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. మంగళవారం దేశంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ లక్షణాలతో మొన్ననే కేరళలో ఒకరు చనిపోయారు. ఇప్పుడు అక్కడే మరో వ్యక్తిలో వైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. జులై 27న యూఏఈ నుంచి కాలికట్ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. తాజాగా నమోదైన కేసుతో కేరళలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 5కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. నైజీరియాకు చెందిన 35ఏళ్ల వ్యక్తికి ఢిల్లీలో మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందన్నారు. తాజా కేసుతో కలిపి ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 8కి చేరింది.
కేరళను మంకీపాక్స్ వైరస్ వణికిస్తోంది. దేశంలో ఇక్కడే తొలి మరణం సంభవించింది. త్రిస్సూరు జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలతో 22 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. దీంతో జిల్లాలోని 20 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. అతడు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి మొత్తం 10 మందితో మాత్రమే కాంటాక్టు అయ్యాడన్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు వైద్యాధికారులు.
మంకీపాక్స్ వైరస్ విస్తరిస్తుండడంతో జనాలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం రాజ్యసభ వేదికగా క్లారిటీ ఇచ్చింది కేంద్రం. మంకీపాక్స్ పై ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. వైరస్ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుందన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన కోరారు.
మంకీపాక్స్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ సిద్ధంగా ఉందని మంత్రి మాండవీయ స్పష్టం చేశారు. తొలిసారి వైరస్ స్ట్రెయిన్‌ను మంకీపాక్స్ నుంచి ఐసీఎంఆర్ వేరు చేసినట్లు చెప్పారు. దీన్ని వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రతిపాదనలు సైతం పంపామని వివరించారు.