Maha Kumbh Mela: 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు

తొక్కిసలాట ఘటనతో కీలక మార్పులు..;

Update: 2025-01-30 04:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా వరుసగా 18వ రోజు కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ (జనవరి 29) 27 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపు 55 లక్షల మంది నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. మరోవైపు కుంభమేళ జరిగే రోజుల్లో మౌని అమావాస్యను భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. బుధవారం ఒక్కరోజే 9-10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారని అధికారులు ప్రకటించారు.

తొక్కిసలాట ఘటనతో కీలక మార్పులు..

మౌని అమావాస్య రోజున త్రివేణీ సంగమం వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో యూపీ సర్కార్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కీలక మార్పులు చేసింది. కుంభ‌మేళా జ‌రిగే ప్రాంతాన్ని పూర్తిగా నో వెహికిల్ జోన్‌గా ప్రక‌టించారు. మ‌హాకుంభ్ ప్రాంతంలోకి వాహ‌నాల ఎంట్రీని నిషేదించారు. వీవీఐపీ పాసుల‌ను ర‌ద్దు చేశారు. వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసుల‌కు కూడా అనుమ‌తి లేదు. అన్ని మిన‌హాయింపుల్ని ర‌ద్దు చేశారు. వ‌న్‌వే రూట్లను అమ‌లు చేస్తున్నారు. భ‌క్తులు సులువుగా న‌డిచేందుకు వ‌న్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమ‌లు చేస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్ స‌మీప జిల్లాల నుంచి వ‌స్తున్న వాహ‌నాల‌ను ఆ జిల్లా స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. డిస్ట్రిక్ బోర్డర్ల వ‌ద్ద వాహ‌నాల‌ను నిలిపివేస్తున్నారు. ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో ఈ చ‌ర్యలు చేప‌డుతున్నారు. ఫిబ్రవ‌రి 4వ తేదీ వ‌ర‌కు చాలా క‌ఠిన నిబంధ‌న‌లు పాటించ‌నున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీల‌ర్ వాహ‌నాల ఎంట్రీని నిలిపివేశారు. కాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.

తొక్కిసలాట ఘటనపై  సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

 ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. దీనిలో తొక్కిసలాటకు సంబంధించి నివేదిక కోరాలని డిమాండ్ చేయబడింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది కాకుండా పెద్ద సంఘటనలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ పిల్‌లో కేంద్ర ప్రభుత్వం, యుపితో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలుగా చేర్చబడ్డాయి. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News