Rahul Gandhi: ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాని, సీఎం త‌క్ష‌ణ‌మే స్పందించాలన్న కాంగ్రెస్ అగ్ర నేత

Update: 2025-10-14 07:30 GMT

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌కు న్యాయం జరగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చండీగఢ్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. పూరన్ కుమార్‌పై ఎలాంటి ఒత్తిడి ఏర్పడిందో దేశమంతా అర్థం చేసుకుంటుందని తెలిపారు. వేధింపులకు గురి చేసిన అధికారులతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హర్యానా ముఖ్యమంత్రి సైనీని కోరుతున్నట్లు చెప్పారు.

వేధించిన అధికారులను అరెస్ట్ చేస్తేనే బాధిత కుటుంబానికి ఒక భరోసా దొరుకుతుందని తెలిపారు. కుటుంబం గౌరవం మాత్రమే కోరుకుంటోందని.. తన భర్తను అగౌరవపరచడానికి ప్రయత్నించారని బాధితుడి భార్య తనతో చెప్పిందని పేర్కొన్నారు. కనీసం అతడి మరణం తర్వాతైనే గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదని.. ఇది దేశంలోని ప్రతి దళిత కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.

కుల వివక్ష కారణంగా పూరన్‌ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే పూరన్‌ కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లను చేర్చాలంటూ మృతుడు భార్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ కుమార్‌ డిమాండ్‌ చేసింది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ పూరన్‌ కుమార్ భార్య అమ్నీత్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని.. ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారంటూ భరోసా ఇచ్చారు. తాజాగా రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి పరామర్శించారు.

Tags:    

Similar News