Mumbai Court: మైనర్ బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇచ్చినందుకు జైలు శిక్ష..

3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3000 జరిమానా...

Update: 2026-02-19 08:00 GMT

 9 ఏళ్ల క్రితం మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. బాలికకు ‘‘ఫ్లయింగ్ కిస్’’ ఇస్తూ వేధింపులకు గురిచేశాడు. ఆ సమయంలో బాలిక వయసు 16 ఏళ్లుగా కాగా, నిందితుడి వయసు 19 ఏల్లు. ప్రస్తుతం నిందితుడికి వివాహమై 3 నెలల పాప కూడా ఉంది. కోర్టు అతడికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3000 జరిమానా విధించింది.

ఈ సంఘటన జనవరి 31, 2017లో జరిగింది. హల్దీ కుంకుమ్ వేడక జరుగుతున్న సమయంలో నిందితుడు, బాలిక వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇది చూసిన పొరుగు వ్యక్తి ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పాడు. బాలికను తల్లి ప్రశ్నించగా.. కొన్ని రోజులుగా నిందితుడు తన వెంట పడుతున్నాడని, తాను ట్యూషన్ వెళ్లే సమయంలో ఒకసారి వెనక నుంచి వచ్చి, తన చేయి పట్టుకుని లాగాడని ఆమె వెల్లడించింది. భయంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఫిబ్రవరిలో ఈ విషయం బాలిక కుటుంబానికి తెలిసింది. నిందితుడిని బాలిక తల్లి తమ అమ్మాయికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే నిందితుడు బాలిక తల్లిదండ్రులను దుర్భాషలాడాడు. దీని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది.

విచారణ సమయంలో నిందితుడి తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. నిందితుడు డ్యాన్స్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ సైగ చేశాడు, అయితే బాలిక దీనిని తిరస్కరించిందని వెల్లడించారు. అయితే, దీని ద్వారా నిందితుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు అంగీకరించాడని కోర్టు పేర్కొంది. ఇది బాధితురాలి గౌరవాన్ని ఉల్లంఘించే లైంగిక వేధింపులే అని చెప్పింది. దీంతో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.

Tags:    

Similar News