Tahawwur Rana: పాక్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ను: తహవ్వుర్
దాడుల సమయంలో ముంబైలోనే ఉన్నట్లు తహవూర్ రాణా వెల్లడి;
26/11 ముంబై దాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని ముంబై పేలుళ్ల కుట్రదారుడు తహవూర్ రాణా అంగీకరించాడు. తహవూర్ రాణాను అమెరికా.. భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. విచారణలో తహవూర్ రాణా సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ముంబై దాడుల్లో తన ప్రమేయం ఉందని అంగీకరించినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. దాడుల సమయలో ముంబైలోనే ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌గా పని చేసినట్లుగా విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వంటి ప్రదేశాల్లో తిరిగినట్లు తెలిపాడు. ఇక ఖలీజ్ యుద్ధం సమయంలో పాకిస్థాన్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని తెలిపాడు.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ఏళ్ల పాటు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవించాడు. అతడిని తమకు అప్పగించాలంటూ భారత్ పలుమార్లు కోరగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అతడిని భారత్‌కు అప్పగించింది. నాటి నుంచి రాణా జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ఇక ముంబై పోలీసులు కూడా కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
26/11 ముంబై దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, ఛత్రపతి శివాజీ టెర్మినల్, యూదు కేంద్రం, నారిమన్ హౌస్ వంటి ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాదాపు 60 గంటల పాటు మారణహోమం సృష్టించారు. నాటి దాడుల్లో 166 మంది మరణించారు.