Namibian Cheetah : నమీబియా చీతా మృతి

Update: 2024-08-28 08:45 GMT

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో చీతా చనిపోయింది. నమీబియా నుంచి తెచ్చిన పవన్‌ అనే మగ చీతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న ఆఫ్రికన్‌ చీతా గామినికి జన్మించిన ఐదు నెలల చీతా కూన మృత్యువాత పడిన కొద్ది వారాల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో నమీబియా చీతా ఎలాంటి కదలికల్లేకుండా పొదల్లో పడి ఉన్నట్లు గుర్తించామని కునో జాతీయ పార్కు అధికారులు తెలిపారు. వెంటనే వైద్యులకు సమాచారం అందించగా.. వారు నిశితంగా పరిశీలించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చీతా ముందు భాగం నీటిలో ఉన్నట్లు గుర్తించారని, శరీరంపై ఎక్కడా ఎలాంటి గాయాల్లేవని తెలిపారు. నీటిలో మునగడం వల్లే మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. కునో జాతీయ పార్కులో ఇంకా 24 చీతాలు మాత్రమే మిగిలాయి.

Tags:    

Similar News