Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో చీతా కూనల సందడి..
3 పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత;
కునో నేషనల్ పార్కులో చీతా కూనలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా షేర్ చేశారు. కొత్తగా పుట్టిన చిరుత కూనలకు సంబంధించిన అందమైన వీడియోని కూడా షేర్ చేశారు. తల్లి పొత్తిళ్లలో అవి ఆడుకుంటూ కనిపించాయి. 20 రోజుల క్రితం నమీబియా నుంచే తీసుకొచ్చిన ఆశా అనే చిరుత మూడు కూనలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
2023 మార్చిలో జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కాగా, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది.
కాగా, కునో నేషనల్ పార్క్‌లో చీతాలు ఒకటి తర్వాత మరొకటి చనిపోతున్నాయి. ఈ నెల శౌర్య అనే చీతా మరణించింది. చిరుతపులి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది. వీటిలో 7 పెద్దవి, మూడు కూనలు ఉన్నాయి. పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే తెలుస్తాయని అధికారులు తెలిపారు. చిరుత ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి కునో నేషనల్ పార్క్‌లో శౌర్యతో సహా 10 చిరుతలు చనిపోయాయి. 2022లో దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వీటిని తీసుకొచ్చారు. చిరుత ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టెంబర్ 17న నమీబియా నుంచి శౌర్యను ఇక్కడికి తీసుకువచ్చారు. నమీబియా నుంచి మొత్తం 8 చిరుతపులిలను తీసుకొచ్చారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను కూడా తీసుకొచ్చారు. భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయిన ఈ జాతిని కాపాడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 20 చిరుతపులులను వదిలారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది.