Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపు.. మోదీతో సహా నేతల శుభాకాంక్షలు..
Draupadi Murmu: దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు;
Draupadi Murmu: దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లిన ప్రధాని.. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ము ఇంటి వద్ద సందడి నెలకొంది. పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు ముర్ము నివాసానికి క్యూ కట్టారు. గిరిజన నృత్యాలతో హోరెత్తుతోంది.
రాష్ట్రపతిగా ఎన్డీఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం దేశ ప్రజల విజయమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీతోనే సాధ్యమైందన్నారు. ద్రౌపది ముర్ము విజయం సాధించిన సందర్బంగా వేముల వాడ రాజన్న ఆలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
తిప్పాపూర్ నుండి రాజన్న ఆలయం వరకు బైక్ నడుపుకుంటూ వచ్చిన బండి సంజయ్‌కు గిరిజనులు వారి సంప్రదాయంతో స్వాగతం పలికారు. గిరిజన మహిళను ఓడగొట్టడానికి కాంగ్రెస్‌తో కలిసి టీఆర్‌ఎస్ కుట్రపన్నిందని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ వంచిస్తే.. బీజేపీ చెప్పకున్నా గిరిజన మహిళకు అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందన్నారు.