Narendra Modi: ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. ఇక చేసేదేం లేక వెనుదిరిగి..

Narendra Modi: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన అనూహ్యంగా రద్దయింది

Update: 2022-01-05 11:40 GMT

Narendra Modi (tv5news.in)

Narendra Modi: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన అనూహ్యంగా రద్దయింది. ఉదయం బఠిండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ప్రధాని..అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుస్సెనివాలాలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థూపం దగ్గర నివాళులర్పించేందుకు బయల్దేరారు. ఐతే మార్గమధ్యంలో ఫ్లై ఓవర్‌పై కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్భందించారు.

దీంతో ప్రధాని కాన్వాయ్‌ 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రధాని మోడీ ఫిరోజ్‌పూర్ బహిరంగసభను రద్దు చేసుకుని తిరిగివెళ్లిపోయారు. దీంతో ఫిరోజ్‌పూర్‌ సభలో ప్రధాని పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రకటించారు కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ. ఈ ఘటనపై సీరియస్‌ అయింది కేంద్ర హోంశాఖ. భద్రతాలోపం కారణంగా ప్రధాని మోడీ పర్యటన రద్దు చేసుకున్నారని హోంశాఖ తెలిపింది.

ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా పంజాబ్‌ సర్కార్‌ను కోరింది హోం శాఖ. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది కేంద్ర హోం శాఖ. పంజాబ్‌లో మోడీ పర్యటన రద్దు కావడం దురదృష్టకరమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పంజాబ్‌లో వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు అంతరాయం కలిగిందన్నారు.

ర్యాలీకి అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులకు ముందే ఆదేశాలు ఇచ్చామన్నారు నడ్డా. కానీ సమస్య పరిష్కరించేందుకు పంజాబ్‌ సీఎం చన్నీ సుముఖత చూపించలేదని ఆరోపించారు నడ్డా. కాంగ్రెస్‌ తీరు చూసి ప్రజాస్వామ్య విలువలను పాటించే వారేవరికైనా బాధ కలుగుతుందన్నారు నడ్డా.

ఘటనపై స్పందించారు అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ. ప్రధాని మోడీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఈ ఘటనను చూస్తే అర్థమవుతుందన్నారు.కాంగ్రెస్ కేవలం పాలిటిక్స్ ప్లే చేస్తుందన్నారు. సరిహద్దు రాష్ట్రంలో ప్రధాని మోడీ భద్రతా లోపం తలెత్తడంపై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు హిమాంత బిశ్వ.

Tags:    

Similar News