Navjot Singh Sidhu: అధిష్టానంపై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు.. అదే జరిగితే పార్టీని పాతిపెడతారంటూ..

Navjot Singh Sidhu: కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాహుల్ గాంధీ వెల్లడించడానికి రెండు రోజుల ముందు..

Update: 2022-02-04 16:21 GMT

Navjot Singh Sidhu (tv5news.in)

Navjot Singh Sidhu: పంజాబ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాహుల్ గాంధీ వెల్లడించడానికి రెండు రోజుల ముందు.. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం అభ్యర్థిత్వానికి చన్నీతో పోటీ పడుతున్న సిద్ధూ.. అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలహీన ముఖ్యమంత్రి ఉండాలని పార్టీలోని అగ్ర నేతలు కోరుకుంటున్నారన్నారు.

వాళ్ల చెప్పుచేతల్లో ఉండి, ఆడమంటే ఆడి, పాడమంటే పాడే వ్యక్తిని సీఎం సీట్లో కూర్చొబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి బలహీనమైన ముఖ్యమంత్రి మనకు కావాలా అని ప్రశ్నించారు. తన మద్దతుదారులతో సిద్ధూ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతికత లేని వ్యక్తిని, అవినీతిలో భాగమైన వ్యక్తిని ఎంచుకుంటే, ప్రజలు మార్పు కోసం ఓటు వేస్తారని.. మిమ్మల్ని ఓ మూలన పాతిపెడతారంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు సిద్ధూ.

తమకు నిజాయతీ గల అభ్యర్థి ముఖ్యమంత్రిగా కావాలన్న సిద్ధూ.. మీరు ఎంచుకున్నదానిపైనే మీభవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. అధిష్టానం ప్రకటించినంత మాత్రానా సీఎం అయిపోరంటూ పరోక్షంగా చన్నీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. నాయకుడనే వాడికి కనీసం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్నారు.

ఎమ్మెల్యేల మద్దతు లేకుండా సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. తనను తాను క్లీన్ అని చెప్పుకున్న సిద్ధూ.. రాజకీయంలో నిజాయితీ గల వ్యక్తిగా 17ఏళ్ల ట్రాక్‌ రికార్డు ఉందన్నారు. తానేం సీఎం అభ్యర్థినని చెప్పుకోవట్లేదని.. కానీ ఆరుసార్లు గెలిచిన సెలబ్రెటీలు ఎంతమందున్నారని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానా లేదా అనేది సమస్యే కాదన్నారు సిద్ధూ. నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించాలన్నారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించినప్పటి నుంచి ఆపదవి కోసం సిద్ధూ పోటీపడుతున్నారు. అయితే దళిత నేత అయిన చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి పదవి వరించింది. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో చన్నీని రెండు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పోటీ చేయిస్తోంది. దీనినిబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయననే ప్రకటించే అవకాశం ఉందనే సంకేతాలను పంపించిందని సిద్ధూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే సిద్ధూ అధిష్టానంపై నిరసనగళం వినిపించినట్లు సమాచారం.సిద్ధూ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మొదటినుంచి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నా.. తీరా అదును చూసి అధిష్టానాన్ని దెబ్బకొట్టేలా సిద్ధూ వ్యాఖ్యలు చేయడంపై పార్టీలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న జరుగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

Tags:    

Similar News