NDA Alliance: నేడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం..
ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు? ఎవరికి ఏ శాఖ;
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టనున్న అండ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలను చకచకా పూర్తి చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీని NDAపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఎన్డీయే తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో నేడు సమావేశం కానున్నారు. ఈ భేటీలో మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఈ నెల 9న మోదీ ప్రమాణం చేయనుండగా కేబినెట్‌లో మిత్రపక్షాలకు ఏయే పదవులు ఇవ్వాలి, పార్టీ నుంచి ఎవరెవరినీ తీసుకోవాలనే అంశంపై భాజపా అగ్రనేతలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు.
ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అవసరమైన లాంఛనాలు చకచకా జరుగుతున్నాయి. ఇవాళ ఎన్డీఏ ఎంపీల భేటీ నిర్వహించనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. ఎన్డీయే ఎంపీల భేటీలో 240 మంది భాజపా ఎంపీలతోపాటు తెలుగుదేశం, జేడీయూ, శివసేన, రాం విలాస్ లోక్‌జన్‌శక్తి, ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను మద్దతు లేఖలను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని...... కోరుతారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశముంది.
మోదీ మంత్రివర్గంలో కూటమిలోని పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ సంఖ్యాబలంలో 15 శాతం మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. ప్రస్తుతం 81 మందిని అమాత్యులుగా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం భాజపాకు సొంతంగా లేదు కాబట్టి గత రెండు దఫాలతో పోలిస్తే కేబినేట్‌లో మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా.. అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.