బీహార్ లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. భారీ మెజార్టీతో తిరుగులేని విజయం ఖాయం చేసుకుంది. 203 సీట్లతో రికార్డులు తిరగరాసింది. మహాఘట్ బంధన్ అత్యంత దారుణంగా 34 సీట్లకే పరిమితం అయింది. ఇంత ఘోరంగా రాహుల్, తేజస్వి కూటమి ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఎన్డీయే ఈ స్థాయిలో గెలవడానికి మోడీ, నితీష్ వ్యూహాలే ప్రధాన కారణం. నితీష్ కు ఉన్న ఇమేజ్ ను రాహుల్-తేజస్వి ద్వయం ఢీకొట్టలేకపోయింది. నితీష్ ఇమేజ్ కు తోడు మోడీ హామీలు, నిధులు తోడవ్వడంతో తిరుగులేని విజయం ఖాయమైంది. మోడీ బీహార్ కు కేంద్ర బడ్జెట్ లోనే భారీగా నిధులు కేటాయించారు.
మహిళలు, నిరుద్యోగ యువత ఓట్లే ప్రధానంగా హామీలు, ప్రత్యేక పథకాలు అమలు చేశారు. వీటికి తోడు ఆర్జేడీ అంటే జంగిల్ రాజా అనే ప్రచారం ఎన్డీయే కూటమి బలంగా చేసింది. అది ఈ ఎన్నికల్లో కూటమికి ప్లస్ అయింది. వ్యూహాలతో పాటు కీలకమైన హామీలు ఇవ్వడం ఎన్డీయేకు ప్లస్ అయింది. అయితే రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ప్రచారం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అత్యంత దారుణంగా మహాఘట్ బంధన్ ఓడిపోయింది. నితీష్ మీదున్న వ్యతిరేకతను కూడా రాహుల్ సరిగ్గా వాడుకోలేకపోయారు.
తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేస్తే బీహార్ ప్రజలు పట్టించుకోలేదు. నితీష్ కంటే బీహార్ ను ఇంకెవరూ బాగా పట్టించుకోలేరని నమ్మారు. అందుకే ఆయనకు జై కొట్టారు. రాహుల్ గాంధీ రొటీన్ ప్లాన్లతో వెళ్తే ఏదీ వర్కౌట్ కాదని ఈ ఎన్నికల రిజల్ట్ తో మరోసారి తేలిపోయింది. కాబట్టి రాహుల్ వ్యూహాలు మార్చాల్సిన టైమ్ వచ్చింది. బీజేపీని ఢీ కొట్టాలంటే ఇలా కూటములు పెట్టుకుని పోటీ చేస్తే వర్కౌట్ కాదని రాహుల్ గుర్తించాలి. ఏ రాష్ట్రంలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో కూడా రాహుల్ కు సరిగ్గా తెలియట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెట్టేసి పని చేసే వారికి గుర్తింపు ఇస్తేనే రిజల్ట్ వస్తుందని రాహుల్ గుర్తించాలి.