MK Stalin: 10 వేల కోట్లిచ్చినా ఎన్‌ఈపీ అమలుచేయం
కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ’’ వివాదం..;
జాతీయ విద్యా విధానం పై గత కొన్ని రోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తాను ఈ NEPకి వ్యతిరేకంగా తన వైఖరిపై రాజీ పడలేనని చెప్పారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా కూడా తమిళనాడులో దీనిని అమలు చేయమని చెప్పారు.
చెంగల్పట్టులో జరిగిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, విద్య, మహిళల అభ్యున్నతికి సంబంధించి తమిళనాడు మార్గదర్శకంగా ఉందని, తక్కువ అడ్డంకులు ఉంటే రాష్ట్రం మరింత మెరుగ్గా రాణించగలదని అన్నారు. ‘‘ నిన్న పార్లమెంట్‌లో ఏం జరిగిందో మీరంతా చూసే ఉంటారు. తమిళనాడుకు అందించాల్సిన నిధులు రాష్ట్రంలో త్రిభాషా సూత్రాన్ని వర్తింపచేసి, హిందీ మరియు సంస్కృతాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అహంకారంలో అన్నారు’’ అని స్టాలిన్ ఆరోపించారు.
కేంద్రం తమిళనాడు విద్యా విధానాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారని, మేము దానిని వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ చెప్పారు. విద్యార్థులను విద్యకు అందించే బదులు, విద్యకు దూరం చేయడానికి జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. విద్యను ప్రవేటీకరించడం, ఉన్నత విద్యను ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంచడం, విద్యలో మతాన్ని ప్రవేశపెట్టడం, నీట్ పరీక్షలు తీసుకురావడం, విద్యలో కేంద్రానికి మరింత అధికారాన్ని ఇవ్వడానికి దీనిని తీసుకువచ్చారని ఆరోపించారు. కేంద్ర విద్యా మంత్రి తమిళనాడును బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, కేవలం రూ. 2,000 కోట్లు కాదు, మీరు రూ. 10,000 కోట్లు ఇచ్చినా మేము మీ వినాశకరమైన నాగ్‌పూర్ పథకాన్ని అంగీకరించము. ఈ వేదికపై నేను దానిని మళ్ళీ పునరావృతం చేస్తున్నాను’’ అని స్టాలిన్ ప్రకటించారు. ఎన్‌ఈపీని ఆర్ఎస్ఎస్ ఎజెండాగా ఆరోపించారు. కేంద్రం విద్యా శాఖ మంత్రి తమిళుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.