Jharkhand: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

కొనసాగుతున్న ఆపరేషన్;

Update: 2025-04-21 04:00 GMT

 జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నరన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 5.30 గంటల సమయంలో లుగు కొండల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారని సీఆర్‌పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌ రైఫిళ్లతోపాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

కాగా, ఈ నెల 14న జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో 11 మావోయిస్టు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా బాక్రబేదా అటవీ ప్రాంతంలో రెండు ఐఈడీలను గుర్తించారు. వాటిని బాంబు స్కాడ్‌ సిబ్బంది నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News