AIR INDIA: అదిరిపోయిన "ఎయిరిండియా న్యూలుక్"
నూతన ఎయిరిండియా లోగో లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ ఆవిష్కరణ, కృత్రిమ మేధను అందుబాటులోకి తీసుకొస్తామన్న సంస్థ;
ఎయిరిండియాలో అత్యాధునిక కృత్రిమ మేథ(artificial intelligence)ను అందుబాటులోకి తీసుకొస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు ఎయిరిండియా మానవ వనరుల సేవలను అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసిన విమానాలు వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చంద్రశేఖరన్ తెలిపారు. అప్పటివరకూ ప్రస్తుత విమానాలను ఆమోదయోగ్యమైన స్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎయిరిండియాలో అధునాతన మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(.AI transformation) తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రశేఖరన్ వెల్లడించారు. ఎయిరిండియా అనేది టాటా సన్స్ గ్రూప్‌నకు కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, అదో అభిరుచి అని చంద్రశేఖరన్ తెలిపారు.
ఎయిరిండియా(Airindia)ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్(Tata-group-owned airline) తాజాగా.. ఆ సంస్థ లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ(Aircraft Livery Unveiled)లో మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న లోగో స్థానంలో(New Air India Logo) గులాబీ రంగుపై తెల్లని అక్షరాలతో ‘AIRINDIA’ అని తీర్చిదిద్దారు. దానికి పైన మహారాజా మస్కట్‌ను కూడా పొందుపరిచారు. అవధుల్లేని అవకాశాలకు చిహ్నంగా ఈ మస్కట్‌ను అక్కడ చేర్చినట్లు బ్రాండింగ్ లోగో(new brand identity ) ఆవిష్కరణ సందర్భంగా చంద్రశేఖరన్ తెలిపారు. లోగోలో ఎయిరిండియా ఫాంట్‌ను కూడా మార్చారు. దీనికోసం సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ ఫాంట్‌ను డిజైన్ చేశారు. డిసెంబరు 2023 నుంచి కొత్త లోగోతో ఈ విమానాల సర్వీసులు మొదలవుతాయని చంద్రశేఖరన్ తెలిపారు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగవిమానయాన సంస్థ ఎయిరిండియాను 2022 జనవరిలో టాటాసన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలు మార్పులు చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. ఎయిర్ బస్, బోయింగ్ విమాన తయారీ సంస్థల నుంచి దాదాపు 70 మిలియన్ డాలర్ల విలువైన 470 విమానాల కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఏడాది నవంబరు నుంచి కొత్త విమానాల డెలివరీలు మొదలుకానున్నాయి.
జనవరి 2022లో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాత రీబ్రాండింగ్ చేసింది. టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, టాటా సన్స్ ఎయిర్‌లైన్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసిన అనంతరం ఎయిర్ ఇండియా మరియు టాటా సన్స్ యొక్క మరొక అనుబంధ సంస్థ విస్తారాలను విలీనం చేసి మరింత ఏకీకృత సంస్థను రూపొందించనున్నట్లు ప్రకటించారు. 1946లో ఎయిర్ ఇండియా ప్రారంభమైనప్పటి నుండి మహారాజా అనేది ఎయిర్ ఇండియా గుర్తింపులో అంతర్భాగంగా ఉన్న విషయం తెలిసిందే.