Gujarat: అర్ధరాత్రి అంబులెన్స్‌లో మంటలు.. నలుగురు సజీవదహనం
గుజరాత్‌లోని అర్వల్లి జిల్లాలో విషాద ఘటన
గుజరాత్ లో ఘోర ప్రమాదం సంభవించింది. అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో నవజాత శిశువు, ఓ వైద్యుడు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని అర్వల్లి జిల్లాలో గల మోడసా పట్టణ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో చిన్నారిని మోడసాలోని ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో మోడసా-ధన్సురా రహదారిపై అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి ఆ సమయంలో అంబులెన్స్‌లో శిశువు తండ్రి జిగ్నేష్ మోచి , అహ్మదాబాద్‌కు చెందిన వైద్యుడు శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మనత్ (23) ఉన్నారు. ఈ ప్రమాదంలో వారు సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. అంబులెన్స్ డ్రైవర్, మరో ముగ్గురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారు కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.