Bengaluru: వివాహమైన 45 రోజులకే భార్య ఆత్మహత్య.. భయంతో భర్త కూడా

కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన తల్లి

Update: 2025-12-29 02:00 GMT

వరకట్న వేధింపుల ఆరోపణలు , కలహాలు రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. వివాహమైన కొన్ని రోజుల్లోనే భార్యాభర్తలు ఇద్దరూ తనువు చాలించగా.. ఓ తల్లి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న(35), గానవిలకు నెలన్నర క్రితం వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్రయాణం అర్థాంతరంగా రద్దైంది. వివాదం కారణంగా గత వారం తిరిగి బెంగళూరు చేరుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం సంఘర్షణ జరిగిందో ఏమో తెలియదు గానీ గత మంగళవారం గన్వి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటిలేటర్‌పై రెండు రోజులు చికిత్స అందించారు. గత గురువారం వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

గానవి మరణంతో ఆమె తల్లిదండ్రులు సూరజ్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయం, గానవి బంధువుల నుంచి వస్తున్న ఒత్తిడి భరించలేక సూరజ్ తన తల్లి జయంతి, తమ్ముడితో కలిసి బెంగళూరు నుంచి పారిపోయాడు. హైదరాబాద్ మీదుగా నాగ్‌పూర్ చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో తలదాచుకున్నాడు.

అయితే, కేసుల గొడవలు, భార్య మరణం మిగిల్చిన వేదనతో సూరజ్ శుక్రవారం రాత్రి హోటల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి జయంతి(60) గుండె పగిలి అక్కడే ఆత్మహత్యకు యత్నించింది. హోటల్ సిబ్బంది గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కేవలం 45 రోజుల క్రితం పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ రెండు ఇళ్లు ఇప్పుడు విషాదంలో మునిగిపోయాయి.

Tags:    

Similar News