Shimla :శివ.. శివా... ఎంత ఘోరం

భారీ వర్షాలకు ఆలయం కూలి 9 మంది మృతి

Update: 2023-08-14 07:00 GMT

భారీ వర్షాలు (Heavy Rains) హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh)ను అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టికి పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా... చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా శిమ్లా (Shimla)లోని ఓ ఆలయం (Temple)పై కొండచరియలు (Landslides) విరిగిపడి 9 మంది మృతిచెందారు.మరో 25 నుంచి 30 మంది ఆలయ శిథిలాల కిందే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. దీంతో ఆలయం కుప్పకూలి పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనాస్థలానికి ఫైర్ బ్రిగేడ్ , SDRF బృందాలను పంపినట్లు వివరించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు.


నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయం కూలిన ఘటనపై ముఖ్యమంత్రి సఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు.

హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో శిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అప్రమత్తమైన ప్రభుత్వం నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News