Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గా నిర్మలా సీతారామన్
వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్‌లో వరుసగా రెండోసారి నిర్మలమ్మ ఈ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిర్మలమ్మ రికార్డుకెక్కారు. బుధవారం ఉదయం నార్త్ బ్లాక్‌కు చేరుకున్న నిర్మలమ్మకు ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చేనెల లోక్‌సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.