TAMILNADU: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు
డీఎంకే కూటమిలో డీఎండీకే... స్టాలిన్‌తో ఓపీఎస్ భేటీ... తమిళనాట కొత్త పొత్తులు
తమిళనాడు శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమిలో చేరారు. సినీ నటుడు దివంగత విజయకాంత్ 2005లో స్థాపించిన డీఎండీకే, ఒకప్పుడు అన్నాడీఎంకేతో కలిసి ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుని ద్రావిడ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగిన చరిత్ర కలిగిన పార్టీ. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు అధికార డీఎంకేతో చేతులు కలపడం తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికినట్లయింది. విజయకాంత్ ఆశయాల సాధన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రేమలత ప్రకటించడం విశేషం. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పొత్తును ఒక లౌకికవాద ప్రగతిశీల కూటమిగా అభివర్ణిస్తూ, రాష్ట్ర పురోభివృద్ధికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. 2016లోనే ఈ కలయిక సాకారం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల దశాబ్దం పాటు ఆలస్యమైందని ప్రేమలత విజయకాంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గురువారం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్‌ను ప్రత్యక్షంగా కలిసి మద్దతు ప్రకటించిన ఆమె, త్వరలోనే సీట్ల కేటాయింపుపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.
ద్రావిడ మోడల్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగడానికి డీఎండీకే వంటి పార్టీల మద్దతు ఎంతో అవసరమని, అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పయనిద్దామని స్టాలిన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు, అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రాజకీయంగా ఒంటరైన మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) కూడా అనూహ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది. జయలలిత మరణం తర్వాత పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓపీఎస్, ఇప్పుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన స్టాలిన్‌ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం, డీఎంకే ఐదేళ్ల పాలన అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు రాజకీయంగా తీవ్రస్థాయిలో తలపడిన నేతలు ఇప్పుడు ఇలా ఒకే వేదికపైకి రావడం పట్ల విశ్లేషకులు ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు. ఓపీఎస్ ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే ఐయ్యప్పన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలిత ఆశీస్సులతో స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించడం అన్నాడీఎంకే శ్రేణులకు మింగుడు పడటం లేదు. సాక్షాత్తు అన్నాడీఎంకే దైవాలుగా భావించే నేతల పేర్లు ప్రస్తావిస్తూ ప్రత్యర్థి పార్టీ నేతను పొగడటం వెనుక ఓపీఎస్ వర్గం వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. తన అనుచరుడి మాటలు ప్రజల మనోగతానికి అద్దం పడుతున్నాయని ఓపీఎస్ సమర్థించడం ద్వారా, రాబోయే ఎన్నికల్లో ఆయన డీఎంకే కూటమికి బాసటగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.