Nitish Kumar: నితీశ్ కుమార్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి .. తేల్చి చెప్పిన అమిత్ షా
నితీశ్ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయన్న అమిత్ షా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని, నితీశ్ కుమార్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్డీటీవీ నిర్వహించిన బీహార్ పవర్ ప్లే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, రాజకీయ అవగాహన కలిగిన రాష్ట్రాలలో బీహార్ ఒకటని అన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బూత్ స్థాయి నుంచి పాట్నా వరకు అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించాయని తెలిపారు. గత 20 ఏళ్లలో బీహార్‌లో అభివృద్ధికి పునాది వేశామని ఆయన పేర్కొన్నారు.
నితీశ్ కుమార్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ప్రజలందరూ చెబుతున్నారని అమిత్ షా అన్నారు. గంగానదిపై నాలుగు వంతెనలు నిర్మించామని, మరో పది వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని, ఇది సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదని తెలిపారు. గతంలో దోపిడీలు, హత్యలు జరిగేవని, ఎన్డీయే హయాంలో అవి ఆగిపోయి అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.
ఉపాధి అవకాశాలను వివిధ మార్గాల్లో సృష్టించవచ్చని అమిత్ షా అన్నారు. తేజస్వి యాదవ్ 2 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని, అది బీహార్ బడ్జెట్‌ను చూస్తే సాధ్యం కాదని అన్నారు. ఆ హామీని నెరవేర్చడానికి ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అవసరమని ఆయన పేర్కొన్నారు. బీహార్ నుంచి వలసలు తగ్గాలంటే ఇక్కడే స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించాలని అమిత్ షా సూచించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము నితీశ్ కుమార్ నాయకత్వంలోనే ముందుకు వెళుతున్నామని చాలాసార్లు స్పష్టం చేశామని అమిత్ షా అన్నారు. ఎన్డీయే గెలుస్తుందని, ఆయనే ముఖ్యమంత్రి అని ఆయన పునరుద్ఘాటించారు. గెలిచిన తర్వాత రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ముందుకు వెళతామని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన సీట్లను ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు పంచుకుంటాయని ఆయన అన్నారు.
గత ఐదేళ్లలో ఏం చేశాం, తదుపరి ఐదేళ్లలో ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమ బలం గురించి ఆలోచించకుండా, కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయడమే బీజేపీ విధానమని ఆయన స్పష్టం చేశారు. మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తే తిరిగి జంగిల్ రాజ్ వస్తుందని హెచ్చరించారు. బీహార్ ప్రజలు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.