Opposition meet :సోనియా చేతికే ఇండియా
‘ఇండియా’ సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియా, కన్వీనర్‌గా నితీశ్ కుమార్..;
విపక్ష కూటమి ‘ఇండియా’ సారథ్యంలో.....11 మంది సభ్యులతో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ, కన్వీనర్‌గా బిహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్లు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. ఈనెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో ముంబైలో జరగనున్న ‘ఇండియా’ మూడోభేటీలో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపకుంటే.. ఆమె సూచించే మరో నేతకు ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కూటమిలోని పార్టీల మధ్య రాష్ట్రాలవారీగా సీట్ల పంపిణీ ఎలా జరగాలి ? ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి ? అనే దానిపైనా ఈ మీటింగ్ లో చర్చ జరగనుంది.
రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తరువాత జరగనున్న సమావేశం కావడంతో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 11 మంది సభ్యులతో ఏర్పాటయ్యే సమన్వయఈ కమిటీలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్‌జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం), ఎన్‌సీపీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ(ఎం) నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉండనున్నారు.
ఆహ్వానాలు పంపే విధానం, ఇతర ఏర్పాట్లపై చర్చలు, సమావేశం నేపథ్యంలో ప్రోటోకాల్‌లను అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లు ఇప్పటికే సమర్పించినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇక ఆగస్టు 31న ఐదుగురు ముఖ్యమంత్రులతో సహా విపక్ష నేతలకు ఉద్ధవ్ ఠాక్రే విందుకు ఆతిథ్యం ఇస్తారని శివసేన (యూబీటి) నేత సంజయ్ రౌత్ తెలిపారు. గ్రాండ్ హయత్‌లో జరిగే రెండు రోజుల చర్చలు ఆగస్టు 31 సాయంత్రం, సెప్టెంబరు 1 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. సమావేశం తరువాత విలేకరుల సమావేశం ఉండనుంది.
విపక్ష కూటమి మొదటి సమావేశం జూన్ 23న పాట్నాలో జరిగింది, దీనిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. రెండవ సమావేశం జూలై 18న బెంగళూరులో జరిగింది, ఈ సమావేశంలోనే ఈ 26 ప్రతిపక్ష పార్టీల కూటమికి I.N.D.I.A (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని పేరు పెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో తలపడేందుకు మెగా కూటమి ఏర్పడింది.