Tejashwi: బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తేజస్వీ యాదవ్ విమర్శ
నలుగురు చేతుల్లో బందీగా ఉన్నారని ఆరోపణ;
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్.. నలుగురు చేతుల్లో బందీగా ఉన్నారని ఆరోపించారు. నితీష్ కుమార్ మరోసారి కూటమి మారతారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తేజస్వీ స్పందిస్తూ… ఊహాగానాలకు ఎటువంటి ఆధారాల్లేవని అన్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. అయితే నితీష్ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, ముఖ్యంగా నలుగురు నేతల చేతిలో ఆయన బందీగా మారారని ఆరోపించారు.
అందులో ఇద్దరు ఢిల్లీలో ఉండగా..మరో ఇద్దరు ఆయన పక్కనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీతో దోస్తీపై పునరాలోచించుకోవాలని నితీష్‌కు కేజ్రీవాల్ లేఖ రాశారు.. ఇంత జరుగుతున్నా నితీష్ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలిపట్లేదని అన్నారు. దీన్ని బట్టి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. నితీష్ పాలనలో బీహార్ ప్రజలు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని ఆందోళన వ్యక్తం చేశారు.