Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..
అరెస్టు పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన హైకోర్టు;
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం విచారించింది. మద్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న దిల్లీ సీఎం విజ్ఞప్తిపై ఈనెల 2 లోపు వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 3న దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని, ఎలాంటి వాయిదాలను ఇవ్వబోమని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు విధించిన 6 రోజుల ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు దిల్లీ కోర్టు ఎదుట ఈడీ హాజరుపరచే అవకాశం ఉంది. కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం ఉంది. లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే 16 మందిని విచారిస్తున్న ఈడీ.. ఈ నెల 22వ తేదీన దిల్లీ సీఎంను అరెస్టు చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారుల్లో కేజ్రీవాల్ కూడా ఒకరని ఆరోపించింది. 10 రోజుల కస్టడీని ఈడీ కోరగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల రిమాండ్‌కు అనుమతించింది. ఫలితంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో నిజానిజాలను తన భర్త అరవింద్ కే జ్రీవాల్ కోర్టులో బయటపెట్టనున్నట్లు ఆయన సతీమణి సునీత కేజ్రివాల్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేసిన ఆమె మద్యం కేసుగా పిలుస్తున్న దాంట్లో డబ్బు ఎక్కడుందో ఆధారాలతో సహా నేడు కేజ్రివాల్ కోర్టులో చెబుతారని పేర్కొన్నారు. ఈ కేసులో గత రెండేళ్ల నుంచి 250కి పైగా దాడులు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ -ఎడ్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని సునీత కేజ్రివాల్ అన్నారు. అందుకే అరవింద్ కేజ్రివాల్ మద్యం కేసుకు సంబంధించిన సొమ్ము ఎక్కడుందనే వివరాలను దేశప్రజలకు వెల్లడిస్తానని చెప్పినట్టు తెలిపారు.
మరోవైపు లోక్ సభ ఎన్నికలకు ముందు పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి పంజాబ్ లో ఉన్న ఏకైక MP సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఆయనతో పాటే జలంధర్ వెస్ట్..... ఆప్ MLA శీతల్ అంగురాల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జలంధర్ నియోజకవర్గం నుంచి సుశీల్ కుమార్ రింకూ గతేడాది ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. జలంధర్ అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరుతున్నానని సుశీల్ కుమార్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఆప్ ప్రభుత్వం తనకు సహాయం చేయడం లేదని MP ఆరోపించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రవ్ నీత్ సింగ్ బిట్టూ మంగళవారం బీజేపీలో చేరారు.