బహిరంగ సభలు, సమావేశాలకు వచ్చే ప్రజలందరూ ఓటు వేయరని ఎంఎన్‌ఎం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ అన్నారు. ఇది కేవలం టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు మాత్రమే కాదని, రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో వివిధ రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కమల్ హాసన్‌కు ప్రశ్న ఎదురవగా.. ‘‘సభలకు హాజరైన వారందరూ ఓట్లు వేయరు. ప్రజల మద్దతు ఓటింగ్‌గా మారడం కష్టం. ఇది నాయకులందరికీ వర్తిస్తుంది.. విజయ్‌కు కూడా. నాతో సహా దేశంలోని ప్రతి నాయకుడికి ఈ విషయం సరిపోతుంది’’ అని ఆయన అన్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌కు ఏమైనా సలహా ఇస్తారా అని అడగ్గా.. ‘‘సన్మార్గంలో ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రజలకు సేవ చేయాలి’’ అని కమల్ సూచించారు. తాను అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ నాయకులే కాదు, సినిమా రంగంలో ఉన్నవారు కూడా విమర్శలను ఎదుర్కొంటారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రంగంలో కొత్తగా అడుగుపెట్టిన వారిని విమర్శలు వదలవని ఆయన అన్నారు.