jaishanker:పాక్‌తో చర్చల మాటే లేదు: జై శంకర్

చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ వెళ్లడం లేదన్న జైశంకర్... పాకిస్థాన్ పై విమర్శలు;

Update: 2024-10-05 09:30 GMT

పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత్-పాకిస్థాన్ సంబంధాలపై చర్చించేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ లో తన పర్యటన.. SCO సమ్మిట్ 2024పై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్‌సీఓలో సభ్యుడిగా మాత్రమే తాను పాకిస్థాన్‌కు వెళ్తున్నానని.. ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి చర్చలు ఉండబోవని జైశంకర్ తేల్చి చెప్పారు. అక్టోబర్‌ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం (SCO) వార్షిక సమావేశానికి జైశంకర్ హాజరుకానున్నారు.

జైశంకర్ ఏమన్నారంటే..?

తాను షాంఘై సహకార సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే పాకిస్థాన్ కు వెళ్తున్నానని.. భారత్‌-పాకిస్థాన్ సంబంధాలు గురించి మాట్లాడేందుకు కాదని జైశంకర్ స్పష్టం చేశారు. ఎస్‌సీఓలో సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నానని తెలిపారు. సౌత్‌ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్‌ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC)లో విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం గురించి కూడా జైశంకర్ ప్రస్తావించారు. కొన్ని చిన్న కారణాల వల్ల సార్క్ సమావేశాలు జరగడం లేదని... సార్క్‌లోని ఒక సభ్యదేశం.. ఆ గ్రూప్‌నకే చెందిన దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ దేశం చర్యల వల్లే సార్క్ సమావేశాలు ఆగిపోయాయని.. అయితే పూర్తిగా ప్రాంతీయ కార్యకలాపాలు నిలిచిపోయాయని దానర్థం కాదని వెల్లడించారు. గత ఐదారేళ్లుగా.. భారత ఉపఖండంలో మరింతగా ప్రాంతీయ సమైక్యత పెరిగిందని జై శంకర్ వెల్లడించారు.

మోదీకి ఆహ్వానం

ఎస్‌సీవో సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆగస్టు 30న ఆహ్వానం పంపింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్‌సీఓ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. కశ్మీర్ సమస్య, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అలాంటి పాకిస్థాన్‌కు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి భారత విదేశాంగ మంత్రి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి జైశంకర్‌ నాయకత్వం వహిస్తారని, ఆయన కేవలం ఈ సదస్సు కోసం మాత్రమే వెళ్తున్నారని జైశ్వాల్‌ స్పష్టంచేశారు. షాంఘైలో 2001లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఎస్‌సీవో (SCO) ఏర్పాటైంది. తొలుత ఇందులో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్థాన్‌, తజికిస్థాన్, ఉబ్జెకిస్థాన్‌లు ఉండగా.. 2017లో భారత్‌, పాకిస్థాన్‌లు శాశ్వత సభ్యత్వం పొందాయి. గతేడాది భారత్‌ ఆతిథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సు సందర్భంగా ఇరాన్‌ శాశ్వత సభ్య దేశంగా చేరింది.

Tags:    

Similar News