Satya Pal Malik : ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు, హత్యలు జరగొచ్చు
ప్రధాని ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారన్న మాజీ గవర్నర్;
ఎన్నికల ముందు మోదీ ఎంతకైనా తెగిస్తాడంటూ ప్రధాని నరేంద్ర మోదీపై జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మోదీ ఏ పని చేయడానికీ వెనుకాడరన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చంటూ సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా ప్రజల సానుభూతి పొందడం కోసం పాకులాడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయినా సరే వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని తేల్చి చెప్పారు. ఎన్నికల తర్వాత మోదీ అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అంటూ సత్యపాల్ మాలిక్ ఓ హిందీ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుకూల వ్యక్తులలో కూడా కొందరికి మోదీ అంటే పడదన్నారు. వచ్చే ఎన్నికల్లో 200 ఎంపీ సీట్ల కన్నా తగ్గితే బీజేపీ నాయకులే మోదీని తప్పిస్తారని పేర్కొన్నారు.
మణిపూర్ హింస ఘటనపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా.. మోదీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళన చేపట్టినా ప్రధాని మోదీ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బేటీ బచావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు.