Odisha Train accident : కోరమండల్ ప్రమాద నేపథ్యంలో మరో బదిలీ
నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సౌత్ ఈస్ట్రన్ జీ ఎం ట్రాన్స్ఫర్;
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషిపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో ఆమెపై చర్యలకు దిగింది. బెంగళూరులోని యలహంకలో గల రైల్వే వీల్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా బదిలీ చేసింది.
అర్చన జోషి స్థానంలో అరుణ్ కుమార్ మిశ్రాను నియమించింది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్‌గా 1985 ఐఆర్‌టీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి అరుణ్ కుమార్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే బాధ్యతలను స్వీకరించారు.
జూన్ 2వ తేదీన వెస్ట్ బెంగాల్ షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.ఘోర ప్రమాదంలో 291 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ధారణకు వచ్చింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా పలువురు ఆగ్నేయ రైల్వేకు చెందిన సీనియర్ అధికారులు, టెక్నికల్ సిబ్బంది, స్టేషన్ మేనేజర్లు, ఇలా చాలామందిని సీబీఐ అధికారులు విచారించారు. కేంద్రం ఇప్పటికే కొందరు సీనియర్ అధికారులకు ట్రాన్స్ఫర్ లు చేసింది.
మరోవైపు ప్రమాదం తర్వాత 81 మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే మృతదేహాలు పోల్చుకునే స్థితిలో లేకపోవడంతో ఒక్కో డెడ్ బాడీ కి ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు రావడం, అవి తమ వారివే అని చెబుతుండటంతో డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు. ప్రస్తుతానికి 29 మంది మృతదేహాల గుర్తింపు జరిగి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఊర్లకు మృతదేహాల తరలింపు కోసం రవాణా సౌకర్యం కల్ల్పించారు. అయితే మృతదేహాలను ఊర్లకు తీసుకెళ్లని పక్షంలో బంధువుల విన్నపం మేరకు అంత్యక్రియల కోసం భువనేశ్వర్ లోని రెండు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు మేయర్ తెలిపారు. మరో 52 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. గుర్తింపునకు నోచుకోని మృతదేహాలను పరదీప్ పోర్టు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కంటెయినర్లలో మైనస్ 17 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచినట్టుగా తెలుస్తోంది.