Ola Scooter Catches Fire : ఓలా స్కూటర్‌లో చెలరేగిన మంటలు..
బెంగళూర్‌లో ఘటన..వైరల్ అవుతున్న వీడియో..;
పార్క్ చేసిన ఓలా స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఆ కంపెనీ షోరూమ్ బయటే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఓలా దీపావళీ’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జయదేవ్ హాస్పిటల్ సమీపంలోని ఓలా షోరూమ్ బయట ఆ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపి ఉంది. అయితే ఉన్నట్టుండి దాని సీటు కింద నుంచి మంటలు చెలరేగాయి. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
కాగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య బల్లాల్ జైన్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఓలా స్కూటర్ యజమానికి మరో మండే రోజు’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైఫల్యాన్ని విమర్శించారు. ఓలా ‘ప్రత్యేక దీపావళి ఫీచర్’, ఓలా ‘కార్పొరేట్ దీపావళి పార్టీ’ అని కామెంట్లు చేశారు. దీపావళి ధమాకా కోసం ఓలా సిద్ధమవుతోందా? అని ఒకరు ప్రశ్నించారు.
ఓలా తన వినియోగదారులకు నాసిరకం సేవలు అందిస్తోందనే ఆరోపణలు వినిపిస్తుున్నాయి. అయితే, నిన్న 99.1 శాతం మంతి తమ కస్టమర్ల సమస్యల్ని సంతృప్తికరంగా పరిష్కరించినట్లు ప్రకటించింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలాపై వచ్చిన వేల కొద్ది ఫిర్యాదులపై అక్టోబర్ 07న షోకాజ్ నోటీసులు పంపింది. దీని తర్వాత ఓలా నుంచి ప్రకటన వచ్చింది.