Smart Phone effect: మతి పోగొట్టిన మొబైల్ గేమ్స్
ఫ్రీ ఫైర్ ఆడి, ఓడి మతి స్థిమితం కోల్పోయిన బాలుడు;
అదుపుతప్పిన మొబైల్ వాడకం అందమైన బాల్యాన్ని చిదిమేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఆటలు ఆడి.. అందులో ఒడి మతి స్థిమితం కోల్పోయిన ఓ పదేళ్ల బాలుడి ఘటన రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది.
ఇప్పుడు ప్రతిఒక్కరి ఇంట్లో టీవీ, చేతుల్లో సెల్‌ఫోన్ తప్పనిస. ఇంట్లో వినోదం కోసం టీవీ అయితే సమాచారం చేరావేసేందుకు మొబైల్.. మొదట్లో ఇదంతా అందంగానే ఉండేది మా పిల్లలు రిమోట్ ఆపరేట్ చేస్తున్నారు, మొబైల్ లో వాడికి చాలా విషయాలు తెలుసు అన్న రోజుల్లో.. ఇప్పుడు మన కంప్లైంట్ లు మారాయి బాబోయ్ మా వాడు టీవీ వదలండండీ.. మొబైల్ లేకపోతే మా చంటిదానికి ముద్ద దిగదు అంటూ తలపట్టుకు కూర్చునే పరిస్థితి వచ్చేసింది.
ఫోన్ ఇవ్వకపోతే గోల గొడవ చేసి మరీ ఫోన్ తీసుకోవటమే కాకుండా ప్లే స్టోర్ల నుంచి కొత్త కొత్త గేమ్స్‌ను ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం గడిపేస్తున్నారు అలా స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు.. అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఫ్రీ ఫైర్ కి అలవాటు పడ్డాడు.. ఎంతలా అంటే ఫోన్‌లో ఆడుకుంటూ గంటలు గంటలు గడిపేసేవాడు. ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన బాలుడు నిరాశను తట్టుకోలేకపోయాడు.. మతిస్థిమితం కోల్పోయాడు. ఏం జరిగిందో అర్థం కాని తల్లిదండ్రులు నిపుణుల సహాయం కోరారు. అప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల టీచర్ భవానీ శర్మ మీడియాకు తెలిపారు.
పరిస్థితి ఇంతవరకు వచ్చేవరకు వేచి చూడద్దని చెబుతున్న నిపుణులు మీ పిల్లల్ని మొబైల్ నుంచి దూరం చేసే బాధ్యత మీదే అని గట్టిగా చెబుతున్నారు. మొబైల్ అతిగా చూసే పిల్లలు మెదడు సంబంధిత సమస్యలు, ఒత్తిడికి గురి కావడం, తలనొప్పి, ఆకలి మందగించడం, నిద్రలేమి సమస్య, సరిగ్గా చదవలేకపోవడం, ఏకాగ్రత లోపించడం, చదివింది గుర్తు లేకపోవడం, కంటి సంబంధిత రోగాలు బారిన పడే అవకాశం ఉంది.
4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఒక గంట,10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లలు రెండు గంటల పాటు టీ వీ లేదా మొబైల్ చూడచ్చు.. అది కూడా రెండు భాగాలుగా సగం సమయం వినోదం కోసం కార్టూన్ ఛానళ్లు, మరో సగం విద్య, ఆర్ట్, స్కిల్ డెవలప్‌మెంట్ లక్షణాలు పెంచే ఛానల్స్ చూపిస్తే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.