ఉమ్మడి పౌరస్మృతి అంశంలో కీలక పరిణామం
ఉమ్మడి పౌరస్మృతి అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది 22వ లా కమిషన్.;
ఉమ్మడి పౌరస్మృతి అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది 22వ లా కమిషన్. ప్రజలు, మత సంస్థలతో సహా ఈ అంశంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 21వ లా కమిషన్ సైతం ఇదే అంశంపై రెండుసార్లు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కుటుంబ చట్టాల్లో సంస్కరణ’లపై 2018 ఆగస్టు 31న కన్సల్టేషన్ పేపర్ కూడా రిలీజ్ చేసింది. తాజాగా సంప్రదింపులు మొదలుపెడుతున్నట్లు 22వ లా కమిషన్ పేర్కొంది. ఇందుకనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజలనుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. 30 రోజుల్లోపు లా కమిషన్‌కు ఈ-మెయిల్ ద్వారా అభిప్రాయాలు పంపొచ్చని పేర్కొంది.
శీతాకాల సమావేశాల్లో దీనిపై కేంద్రం బిల్లు తీసుకురావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ ప్రజాభిప్రాయాలను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఉమ్మడి పౌరస్మృతిలో మతంపై ఆధారపడకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక తదితర అంశాల్లో వివిధ మతాలకు ఉండే ‘పర్సనల్ లా’లు అన్ని ఈ చట్టంతో ఒకే ఉమ్మడి స్మృతి కిందకు వస్తాయి.