Rahul Gandhi : ప్రతిపక్షాలు డిమాండ్ మేరకే కులగణను మోదీ అంగీకారం : రాహుల్ గాంధీ
అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కుల గణనకు అంగీకరించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓబీసీల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్ లోని దర్భంగాలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. " ఈ సమావేశాన్ని అడ్డుకునేందు కు అధికారపార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారు. యూనివర్సిటీ గేటు బయటే నా కారును నిలిపివేశారు. అయినా, నేను వెనకడుగు వేయలేదు. నడుచుకుంటూ సభా వేదిక మీదికి చేరుకున్నాను. బిహార్ ప్రభుత్వం నన్ను ఎందుకు ఆపలేకపోయిందో తెలుసా? మీ అందరి అభిమానమే నన్ను ముందుకు నడిపించింది. ఇదే శక్తి నరేంద్ర మోదీని దించుతుంది. ప్రతిపక్షాలు డిమాండ్ మేరకే కులగణను మోదీ అంగీకరించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు” అని రాహుల్ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అంబానీ, అదానీల కోసమే పని చేస్తోందని రాహుల్ విమర్శించారు. కేవలం 5శాతం మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని, కార్పొరేట్ వ్యక్తులకే మోదీ గవర్నమెంట్ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ లో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.