INDIA Alliance: మిత్రపక్షాల్లో అసహనం .. కూటమికి బీటలు
ఈ నెల మూడో వారానికి వాయిదా పడ్డ సమావేశం;
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల కూటమి నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఏకపక్ష వైఖరి వల్లనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోయిందనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతోపాటు సార్వత్రిక సమరానికి సంబంధించిన వ్యూహరచనపై చర్చించేందుకు ఈనెల 6న ఇండియా కూటమి సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈమేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భాగస్వామ్య పక్షాలకు ఫోన్ చేసిన సమాచారం ఇచ్చారు. కానీ ఈ భేటీ పట్ల కూటమికి చెందిన కీలక నేతలు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో జతకడితే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే వచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని కూటమి నేతల్లో కొందరు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో కర్ణాటకలో మాదిరిగానే గెలుస్తామన్న ధీమాతో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. హస్తం పార్టీ తీరును కూటమి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విడివిడిగా పోటీచేయటం వల్లనే ఓట్లలో చీలిక వచ్చి ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా ఎన్నికలకు వెళితే ఫలితాలు ఇలాగే ఉంటాయని బంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలు వేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే భారతీయ జనతా పార్టీని ఓడించవచ్చన్న దీదీ బుధవారం తలపెట్టిన ఇండియా కూటమి సమావేశానికి హాజరుకావటం లేదన్నారు. ముందస్తు సమాచారం లేనందున....అదేరోజు వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. ముందే సమాచారం ఉంటే కూటమి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండేదని మమత చెప్పారు.
విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కీలకంగా వ్యవహరించటంతోపాటు కూటమి తొలి భేటీని పట్నాలో నిర్వహించిన బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ కూడా....కాంగ్రెస్ తలపెట్టిన సమావేశం పట్ల పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఈ సందర్భంగా JDU అధ్యక్షుడు లలన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూటమికి కాంగ్రెస్ సారథ్యం వహిస్తే 2024ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని మనసులో మాట చెప్పకనే చెప్పారు. అందువల్ల కూటమి సారథ్య బాధ్యతలు తమ నాయకుడు నీతీశ్‌కుమార్‌కు ఇవ్వాలని లలన్‌సింగ్ డిమాండ్ చేశారు.
మరోవైపు ఇండియా కూటమి సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ హాజరుకాబోరని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ తెలిపారు. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ...సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య విభేదాలు తలెత్తాయి. హస్తం పార్టీ ఏక పక్షంగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటంపై....అఖిలేష్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది సార్వత్రిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై ప్రభావం చూపుతుందని...హస్తం పార్టీని అప్పుడే ఒకింత గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఇండియా కూటమి భేటీ పట్ల అఖిలేష్ పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది