పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై నిరసన తెలిపిన 78మంది విపక్ష ఎంపీలపై ఉభయ సభల్లో వేటు పడిన నేపథ్యంలో నేడు దిల్లీలో జరిగే విపక్ష ఇండియా కూటమి నేతల భేటీ కీలకంగా మారింది. ఏకంగా 100మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌తో విపక్షాలు ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
అధికార భాజపాను ఓడించడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడమే కాకుండా.... సస్పెన్షన్‌పై భవిష్యత్ కార్యచరణను ఈ భేటిలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్షరహిత పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా చేసి కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని మోదీ సర్కారు చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
లోక్ సభలో గత వారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. గతవారం 13 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేశారనే కారణంపై... ఇవాళ ఏకంగా 33 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా సస్పెండైన వారిలో కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరి DMK ఎంపీలు TR బాలు, దయానిధి మారన్ TMC ఎంపీ సౌగతా రాయ్ కూడా ఉన్నారు. 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా వారిలో DMKకు చెందిన 10 మంది, తృణమూల్ కాంగ్రెస్-౯ కాంగ్రెస్-8, IUML, JDU, RSP నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఎంపీలు జయకుమార్ విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఎంపీల పేర్లను..స్పీకర్ పలుమార్లు ప్రస్తావించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి MPల సస్పెన్షన్ కు తీర్మానం ప్రవేశపెట్టగా..మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.
భద్రతా వైఫల్యంపై చర్చించాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో రాజ్యసభలోనూ పెద్దసంఖ్యలో సస్పెన్షన్‌లు కొనసాగాయి.గతవారం తృణమూల్ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్‌ను సస్పెండ్ చేసిన ఛైర్మన్ ఇవాళ మొత్తం 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. 34 మందిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకూ సస్పెండ్ చేశారు.మిగతా 11 మంది ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. కమిటీ నివేదిక వచ్చేవరకూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు..సభాపతులను అవమానించారని రాజ్యసభాపక్ష నేత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ కూడా.విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.