Phone Hacking: మా ఫోన్లు హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నం
యాపిల్ కంపెనీ హెచ్చరికలు?;
ఇండియా కూటమి నేతల ఫోన్లు హ్యాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు. హ్యాకింగ్ ఆరోపణలు చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఉన్నారు. వీరంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో యాపిల్ నుంచి వచ్చిన అల్టర్ మెసేజ్ స్క్రీన్ షాట్‌లను షేర్ చేశారు. ప్రతిపక్షాల ఎంపీల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఇప్పటికే చాలామంది విపక్ష ఎంపీలకు ఆపిల్ సంస్థ నుంచి మెసేజ్‌లు వచ్చాయన్న రాహుల్... ఇలాంటి బెదిరింపులకు తాము వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. తన ఫోన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తానని అన్నారు. ఏయే ఏెంపీలకు సందేశాలు వచ్చాయో చదివి వినిపించిన రాహుల్ దేశ యువత దృష్టి మరల్చేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఎక్స్ అకౌంట్‌లో ఆ సైబర్ అటాక్ మెసేజ్‌ను షేర్ చేశారు. తన ఫోన్‌ను టార్గెట్ చేస్తున్నారని గత రాత్రి యాపిల్ సంస్థ నోటిఫికేషన్ పంపినట్లు ఆయన తెలిపారు. ఆ మెసేజ్‌కు చెందిన స్క్రీన్ షాట్‌ను ఎంపీ ఓవైసీ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ నుంచి తమకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు ఇవాళ ఆరుగురు ఎంపీలు ఆరోపించారు.
ప్రభుత్వం తన ఫోన్‌ను, మెయిల్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ మహువా తన ఎక్స్ అకౌంట్‌లో ఆరోపించారు. ఆమె కూడా తన వార్నింగ్ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాసినట్లు ఆమె చెప్పారు. ప్రివిలేజ్ కమిటీ ఈ అంశాన్ని చర్చించాలని ఆమె సూచించారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలకు వచ్చిన అలర్ట్ మెసేజ్‌లు యాపిల్ అల్గారిథమ్ సమస్య వల్ల వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రం నుంచి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని వెల్లడించారు.